Canada | ఒట్టావా, నవంబర్ 2: కెనడా పార్లమెంటు భవనం బయట ‘ఓం’ చిహ్నం కలిగిన హిందూ జెండాను కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఎగురవేశారు. హిందూ వారసత్వ మాసం సందర్భంగా మూడేండ్లుగా ఆయన ఏటా హిందూ జెండా ఎగురవేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’లో ఆయన తాజాగా పోస్ట్ చేశారు. ‘కెనడా సమాజాల్లో మాది అత్యంత విద్యాధికమైన, విజయవంతమైన సమాజం.
అన్ని రంగాల్లో హిందువులు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో మాత్రం సరైన ప్రాతినిథ్యం లేదు. హిందువులు ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత ఎక్కువగా పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నాను’ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా, భారతీయ మూలాలు కలిగిన, హిందువు అయిన చంద్ర ఆర్య కెనడాలో ఖలిస్థానీలకు వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపిస్తారనే పేరుంది.