Canada PM : కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో (General elections) అధికార లిబరల్ పార్టీ (Liberal party) విజయం సాధించింది. కెనడా ప్రజలు వరుసగా నాలుగోసారి ఆ పార్టీకే పట్టంకట్టారు. ప్రధాని మార్క్కార్నీ (Mark Carney) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో విజయం ఖాయమైన అనంతరం కార్నీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై విమర్శలు గుప్పించారు.
కెనడా ప్రజల్లో విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం చేసి దేశాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మార్క్ కార్నీ మండిపడ్డారు. దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలు విధిస్తోందని, కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని, ట్రంప్ బెదిరింపులకు భయపడవద్దని పిలుపునిచ్చారు.
ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో మనమే గెలుస్తామని కార్నీ కెనడా ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికా మనకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోవద్దని, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా కెనడా అనుసరిస్తున్న ఐక్యత, అభివృద్ధి తదితర విలువలను తాను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని నెలలు సవాలుగా ఉండొచ్చని, అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని కార్నీ పేర్కొన్నారు.
కెనడా గతంలో కంటే ఇప్పుడు బలంగా పుంజుకుంటుందని కార్నీ చెప్పారు. ఎన్నికల్లో తమకు గట్టి పోటీ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకుడు పోయిలివ్రేను కార్నీ అభినందించారు. దేశ అభివృద్ధి విషయంలో తామందరం ఒకేలా ఆలోచిస్తామని తెలిపారు. తమకు మళ్లీ పట్టం కట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కెనడా తమలో విలీనం కావాలని ఇప్పటికే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇవాళ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ మరోసారి టారిఫ్ల ప్రస్తావన తీసుకువచ్చారు. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే ఇప్పటి వరకు విధించిన సుంకాలను పూర్తిగా తొలగిస్తానన్నారు. అమెరికాతో ఎలాంటి సరిహద్దులు లేకుండా ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తామని, వాణిజ్యం, వ్యాపారాల్లో ప్రతికూలతలు లేకుండా అన్నిరకాల సానుకూల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే ఆ దేశానికి ఏళ్లుగా ఇస్తున్న వందల బిలియన్ డాలర్ల సబ్సిడీని ఆపేస్తామని హెచ్చరించారు.