Canada New PM : అమెరికా (USA) నుంచి కెనడా (Canada) టారిఫ్‌ల సవాల్ ఎదుర్కొంటున్న వేళ.. కెనడా పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. రేసులో మొత్తం నలుగురు ఉండగా.. వారిలో ట్రూడో వారసులు అయ్యేదెవరనే అంశం ఉత్కంఠ రేపుతోంది. నూతన ప్రధాని ఎంపిక కోసం ఇవాళ లిబరల్ పార్టీ (Liberal party) లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 1.40 లక్షల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొననున్నారు.
కెనడా ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడ్ (Justin Trudeau).. తన పదవి నుంచి వైదొలగనున్నట్లు గత జనవరిలో ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ నూతన సారథిని ఎన్నుకునేందుకు అధికార లిబరల్ పార్టీ సిద్ధమైంది. అందుకోసం ఇవాళ (మార్చి 9న) ఓటింగ్ నిర్వహించనుంది. ఈ రేసులో మొత్తం నలుగురు కొనసాగుతున్నారు. వారిలో మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్‌లు ఉన్నారు.
ఆ నలుగురిలో మార్క్ కార్నీ, ఫ్రీలాండ్‌ల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. మాజీ బ్యాంకర్ అయిన కార్నీ నూతన ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ కెనడాకు గతంలో గవర్నర్‌గా పనిచేసిన మార్క్ కార్నీ.. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక ట్రూడో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన క్రిస్టియా ఫ్రీలాండ్.. గత డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా సందర్భంగా ఫ్రీలాండ్ రాసిన సుదీర్ఘ లేఖ ట్రూడో రాజీనామాకు దారితీసిందనే వాదన వినిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి సుంకాల సవాళ్లు ఎదురవుతున్న వేళ కెనడా నూతన ప్రధాని ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని ప్రధాని రేసులో ఉన్న లిబరల్ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. సీక్రెట్ ఓటింగ్ ద్వారా పార్టీ చీఫ్‌ను ఎన్నుకోనుండగా.. పార్టీ చీఫ్‌గా ఎన్నికైన వ్యక్తిచేత గవర్నర్ జనరల్ నూతన ప్రధానిగా ప్రమాణం చేయిస్తారు.