లండన్ : బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఆదివారం లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ షాహిన్ హర్షం వ్యక్తం చేయగా.. ఇజ్రాయెల్, అమెరికా విమర్శించాయి. ‘ఇది మనల్ని సార్వభౌమాధికారం, స్వాతంత్య్రానికి దగ్గర చేసే చర్య. ఇది రేపు యుద్ధాన్ని ముగించకపోవచ్చు కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లే చర్య.
దీన్ని మనం నిర్మించి విస్తరించాలి’ అని షాహిన్ రమల్లాహ్లో విలేకరులతో అన్నారు. ఆమె వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తోసిపుచ్చుతూ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ఇది మార్చలేదని తెలిపింది. ఇటీవల ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. ఐక్యరాజ్య సమితి విచారణ కమిషన్ కూడా గాజాలో ఇజ్రాయెల్ సామూహిక హత్యాకాండకు పాల్పడుతున్నదని తెలిపింది.