Sunlight | కాలిఫోర్నియా, ఆగస్టు 29: రాత్రివేళ సైతం సూర్యకాంతిని అందిస్తామని చెప్తున్నది కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే కంపెనీ. ఈ దిశగా తమ ప్రణాళికలను ఈ సంస్థ సీఈఓ బెన్ నోవాక్ వెల్లడించారు. సహజంగా సౌర విద్యుత్తు సూర్యకాంతి ఉన్నప్పుడే ఉత్పత్తి అవుతుంది. కానీ, ఆ సమయంలో విద్యుత్తు అవసరం తక్కువ. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే రాత్రివేళ సౌర విద్యుత్తు ఉత్పత్తి కాదు.
ఈ సమస్యకు పరిష్కారంగా రాత్రిపూట కూడా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశాన్ని కల్పిస్తామని, ఇందుకోసం సూర్య కాంతిని విక్రయిస్తామని నోవాక్ చెప్తున్నారు. ఇందుకు గానూ 57 చిన్న ఉపగ్రహాలను భూమి నుంచి 370 మైళ్ల ఎత్తుకు పంపించనున్నట్టు చెప్పారు.
ఈ ఉపగ్రహాలకు ఒక్కోదానికి 33 చదరపు అడుగుల మైలార్ అద్దాలు ఉంటాయి. నింగిలో ఈ అద్దాలపై పడే సూర్యకాంతి భూమిపై ఉండే నిర్దేశిత సౌర ఫలకాలపై ప్రతిబింబించేలా చేస్తామని, తద్వారా సూర్యాస్తమయం తర్వాత సైతం విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉంటుందని నోవాక్ తెలిపారు. తాజాగా, హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా తమ ఆలోచనను ప్రయోగించి చూపించారు.