Diwali | మన దీపావళి పండుగకు అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తింపు దక్కింది. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఏబీ-268 బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ సంతకం చేశారు.
దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ గతంలోనే ఆ దేశ కాంగ్రెస్లో ఓ బిల్లును తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లును గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇది చట్టంగా మారింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. దీని ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. అలాగే పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలకు కూడా సెలవు ఇవ్వొచ్చు. అయితే కోర్టులకు మాత్రం ఈ సెలవు వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి.
ఇప్పటికే అమెరికాలోని పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. కాగా, అమెరికాలో భారతీయ సంస్కృతికి ఇది గొప్ప గుర్తింపు అని.. సాంస్కృతిక వైవిధ్యానికి గౌరవం తెలిపే చారిత్రక అడుగు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.