యోకెల్లా: బొలివియా(Bolivia)లోని పర్వత ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. యోకెల్లా జిల్లాలోని కొండ మీద నుంచి బస్సు సుమారు 800 మీటర్ల కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. బొలివియాలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. అక్కడ పర్వత ప్రాంతాలు ఎక్కువ కావడం వల్ల .. వాహనాలు లోయలో పడే ఘటనలు కూడా ఎక్కువే. పొటోసీ, ఒరూరో నగరాల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
అతివేగంగా వెళ్లడం వల్ల .. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది బొలివియాలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంగా పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బొలివియాలో భయానక రోడ్డు ప్రమాదాలు జరగడం సాధారణమే. గత నెలలో పొటోసీ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఆ దేశంలో సగటున ఏడాదికి 1400 మంది వివిధ రకాల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశ జనాభా కోటి 20 లక్షల మంది.