లాస్ ఏంజిల్స్: అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి కేసు నమోదు అయ్యింది. ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకినట్లు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల ఒకప్పుడు యూరోప్‌లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరోప్‌లో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు మూడవ వంత జనాభా మృతిచెందింది. దీన్నే బ్లాక్ డెత్‌గా వర్ణిస్తున్నారు. ఓరేగాన్‌లోని డిసెచూట్స్ కౌంటీలో తాజా కేసును గుర్తించారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు.
జంతువు నుంచి ప్లేగు వైరస్ సోకిన 8 రోజుల తర్వాత మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెప్పారు. జ్వరం, బలహీనత, చలి, వొళ్లు నొప్పులు ఆ లక్షణాల్లో ఉన్నాయి. ప్రాథమిక దశలో బుబోనిక్ ప్లేగును గుర్తించి చికిత్స అందించాలి. లేదంటే అది సెప్టిసెమిక్ ప్లేగ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ అవుతుంది. అది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది.
14వ శతాబ్ధంలో యూరోప్‌లో వచ్చిన ఆ వ్యాధి వల్ల 5 కోట్ల మంది బలయ్యారు. అయితే ఓరేగావ్ లో నమోదు అయిన కేసు అత్యంత అరుదైనదన్నారు. ఆ రాష్ట్రంలో చివరిసారి 2015లో ఆ కేసు నమోదు అయ్యింది.