Bruce Lee death | ప్రపంచ ప్రసిద్ద మార్షల్ ఆర్టిస్ట్, సినిమా నటుడు బ్రూస్లీ మరణం వెనుకున్న రహస్యానికి సంబంధించి ఒక నివేదిక బయటపడింది. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్‌గా పేరుగాంచిన బ్రూస్లీ తన 32 ఏండ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. అతడి ఊహించని మరణం చుట్టూ ఉన్న రహస్యం.. దశాబ్దాలుగా వందలాది కుట్ర సిద్ధాంతాలకు దారితీసింది. అతడు చనిపోయిన 49 ఏండ్లకు బయటపడిన నివేదికల ప్రకారం, ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్రూస్లీ సెరిబ్రల్ ఎడెమా లేదా మెదడు వాపుతో బాధపడ్డాడు.
అతడి శవపరీక్షలో అతడి మెదడు 1,575 గ్రాములు (3.5 పౌండ్లు) వరకు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1,400 గ్రాములు (3 పౌండ్లు) కంటే ఎక్కువగా ఉన్నది. అందువల్ల, పెయిన్ కిల్లర్ ఈక్వేజెసిక్కు తీవ్ర ప్రతిచర్య కారణంగా సంభవించిన వాపుతో బ్రూస్లీ మరణించినట్లు పరిశోధన నిర్ధారించింది. ఒక కొత్త విశ్లేషణ ప్రకారం Independent.co.uk నివేదించిన అంశాల ప్రకారం, హైపోనాట్రేమియా వల్ల ఎడెమా ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ‘శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని విసర్జించడంలో మూత్రపిండాలు పనిచేయక బ్రూస్లీ చనిపోయినట్లు ప్రతిపాదించాం..’ అని క్లినికల్ కిడ్నీ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆల్‌టైం గ్రేటెస్ట్ ఆన్‌స్క్రీన్ మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్ అయిన లీ.. తన ఆహారం కారణంగా అధిక మొత్తంలో నీటిని వినియోగించి ఉండొచ్చని నివేదిక పేర్కొన్నది. దాహాన్ని పెంచే రసాలు, ప్రొటీన్ డ్రింక్స్ వంటి ద్రవాలు చాలా బ్రూస్లీ డైట్లో ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదించింది. ఆయన చివరి రోజుల్లో నిత్యం 10 నుంచి 20 సిరామిక్ బాటిళ్ల నీటిని తాగేవాడని బ్రూస్లీ అనుచరుడొకరు వెల్లడించినట్లు తెలిపింది.