Most wanted arrest | బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు. అతడి వయసు 55 ఏండ్లు. బ్యాంకాక్ పట్టణంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. పోలీసుల కళ్లు గప్పి గత ఐదేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న రిచర్డ్ వేక్లింగ్ను అరెస్ట్ చేయడంతో బ్రిటన్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇతగాడి పేరును బ్రిటీష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) కు చెందిన మోస్ట్ వాంటెడ్ వాచ్ లిస్టులో చేర్చారు.
ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్ వేక్లింగ్ తొలి నుంచి డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్‌ను బ్రిటన్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇతగాడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. అక్కడి కోర్టు అతడికి కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే, 2018లో బ్రిటన్ నుంచి తప్పించుకుని రిచర్డ్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం బ్రిటీష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు వెతుకుతున్నారు.
రిచర్డ్ వేక్లింగ్ 1993 నుంచి తరచూ థాయ్‌లాండ్ వెళ్తుండేవాడు. అక్కడి పరిచయాల నేపథ్యంలో అతడు బ్రిటన్ నుంచి థాయ్‌లాండ్‌కు పారిపోయాడు. తనకు సంబంధించిన వివరాలేవీ తెలవకుండా జాగ్రత్తపడ్డాడు. ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకుని పాస్‌పోర్టు కూడా సంపాదించాడు. ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో ఉండటంతో అతడ్ని పట్టుకోవడం బ్రిటన్ పోలీసులకు సాధ్యం కాలేదు. శుక్రవారం సాయంత్రం ఓ రెస్టారెంట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే రిచర్డ్ వేక్లింగ్ అని ఒప్పుకొన్నాడు. సోమవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపర్చి బ్రిటన్ తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ వారంట్ ఇవ్వాలని కోరనున్నారు.