న్యూఢిల్లీ : వేలి ముద్రలు, డీఎన్ఏ మాదిరిగానే శ్వాస పీల్చుకుని, వదిలిపెట్టే తీరు ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనిషిని గుర్తించేందుకు శ్వాస తీరును కూడా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు గుర్తించారు. సెల్ ప్రెస్ జర్నల్ కరంట్ బయాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ నివేదిక ప్రకారం, శ్వాస తీసుకుని, విడిచిపెట్టే తీరును బట్టి 96.8 శాతం కచ్చితత్వంతో వ్యక్తులను గుర్తించవచ్చు. ఈ విధానాన్ని ‘శ్వాస వేలి ముద్రలు’గా అభివర్ణిస్తున్నారు.
వ్యక్తిని గుర్తించే కొత్త పద్ధతిగా మాత్రమే కాకుండా, వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని పరీక్షించడం కోసం ఇజ్రాయెల్‌లోని వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు తేలికపాటి పరికరాన్ని అభివృద్ధి చేశారు. మృదువైన గొట్టాలను ముక్కుపుటాల కింద పెట్టి, 24 గంటలపాటు ముక్కు ద్వారా జరిగే ఉచ్ఛాస, నిశ్వాసాలను గమనించారు. సాధారణంగా శ్వాస పరీక్షలు 1 నిమిషం నుంచి 20 నిమిషాల వరకు జరుగుతాయి. ఇవి ప్రధానంగా ఊపిరితిత్తుల పనితీరును, వ్యాధిని గుర్తించేందుకు ఉపయోగపడతాయి. అత్యంత సూక్ష్మమైన శ్వాస తీరును గమనించడానికి ఈ పరీక్షలు సరిపోవు.
100 మంది ఆరోగ్యంగా ఉన్న యువత ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. శాస్త్రవేత్త నోఆమ్ సోబెల్ నేతృత్వంలోని పరిశోధకులు వీరి ముక్కుపుటాల వద్ద ఈ పరికరాలను అమర్చారు. రోజువారీ సాధారణ జీవనం సాగించాలని వారికి చెప్పారు. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి, శ్వాస తీరు ఆధారంగా వ్యక్తులను నూటికి నూరు శాతం కచ్చితత్వంతో గుర్తించారు. రెండేళ్లపాటు అనేకసార్లు మళ్లీ మళ్లీ పరీక్షలు చేసినపుడు కూడా ఈ అత్యధిక స్థాయి కచ్చితత్వం కొనసాగింది. కొన్ని వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీల కచ్చితత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది.