మెక్సికో: బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ (Boeing Starliner) వ్యోమనౌక.. వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెలవారుజామున 12.01 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్ స్యాండ్స్ స్పేస్ హార్బర్‌కు ఖాళీ క్యాప్సుల్ భూమిని చేరింది. వ్యోమగాములు లేకుండానే ఆటోపైలట్ పద్ధతిలో నాసా దానిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చింది.
బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టులో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ప్రయోగం చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. వారు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్ కావడంతో ప్రోపల్షన్ వ్యవస్థలో లోపాలు, వాల్వ్‌లో సమస్యలు వచ్చాయి. ఎలాగోలా జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉన్నది. అయితే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వస్తున్నది.
The #Starliner spacecraft is back on Earth.
At 12:01am ET Sept. 7, @BoeingSpace’s uncrewed Starliner spacecraft landed in White Sands Space Harbor, New Mexico. pic.twitter.com/vTYvgPONVc
— NASA Commercial Crew (@Commercial_Crew) September 7, 2024
సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టనుంది. ఆమెతోపాటు బారీ విల్మోర్ను ఫిబ్రవరిలో తీసుకువస్తామని, అప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉంటారని నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు వచ్చినందున, దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది.
భూమి నుంచి ఐఎస్ఎస్కి మనుషులను తీసుకెళ్లి, తీసుకురావడం కోసం బోయింగ్ కంపెనీ స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకను తయారుచేసింది. దీని ద్వారా అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య ప్రయాణాలు చేపట్టాలనేది బోయింగ్ సంస్థ లక్ష్యం. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లే, తిరిగి వచ్చే వ్యోమగాములకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని బోయింగ్ అనుకుంటున్నది. స్టార్‌లైనర్‌కు ఈ సామర్థ్యాలు ఉన్నాయని ప్రదర్శించేందుకు సునీతా, విల్మోర్ను అంతరిక్ష కేంద్రానికి పంపించింది. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో బోయింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.