కీవ్: ఉక్రెయిన్‌లో అనేక ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి నెలలో ఇజియమ్ పట్టణంపై కూడా రష్యా దాడి చేసింది. ఆ దాడిలో అయిదు అంతస్తుల బిల్డింగ్ ఒకటి నేలమట్టం అయ్యింది. ఆ భవనం శిథిలాల కింద 44 మంది సాధారణ పౌరుల మృతదేహాలు ఉన్నట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఖార్కివ్ ప్రాంతీయ మిలిటరీ అధికారి ఓలెగ్ సైనిగబోవ్ ఈ విషయాన్ని తెలిపారు. తాత్కాలికంగా ఆక్రమించిన ఇజియమ్ బిల్డింగ్‌పై రష్యన్లు అటాక్ చేశారని, ఆ దాడిలో బిల్డింగ్ కూలిందని, దీంతో అక్కడ ఉన్న 44 మంది పౌరులు చనిపోయినట్లు సైనిగబోవ్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలపై రష్యా పాల్పడుతున్న యుద్ధ నేరమని ఆయన ఆరోపించారు.
ఒడిసా పట్టణంపై మిస్సైల్ దాడులు జరుగుతున్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. తాజాగా దాడుల్లో ఒకరు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. షాపింగ్ సెంటర్‌తో పాటు ఆయుధ డిపోపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
మరియపోల్‌లోని అజోవ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంకా వంద మంది వరకు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ ప్లాంట్‌లో భీకర ఫైటింగ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రష్యా దళాలు ఆ స్టీల్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు ఉక్రెయిన్‌తో పాటు యురోపియన్ దేశాలు చర్చించాయి. ఆహార ధాన్యాల ఎగుమతి కోసం ఉక్రెయిన్ పోర్టులన్నీ తెరుచుకోవాలని ఆ దేశాలు తక్షణ చర్యలు చేపట్టాయి. రష్యా నల్ల సముద్రాన్ని బ్లాక్ చేయడంతో పలు దేశాలకు ఆహార సంక్షోభం ఎదుర్యే అవకాశాలు ఉన్నాయి.