బ్రెసిలియా: బ్రెజిల్ సుప్రీంకోర్టు(Supreme Court) సమీపంలో ఇవాళ బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉన్న కూడలి వద్ద పేలుడు జరిగింది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారని, అతన్ని అడ్డుకున్న సమయంలో పేలుళ్లు జరిగినట్లు బ్రెసిలియా డిప్యూటీ గవర్నర్ తెలిపారు. బిల్డింగ్ బయట ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుళ్ల ఘటనను ఆ దేశ సొలిసిటర్ జనరల్ జార్జ్ ఖండించారు. సుప్రీంకోర్టు బిల్డింగ్ బయట ఓ మృతదేహం ఉన్నదని, కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. సుప్రీంకోర్టు దిశగా ఓ వ్యక్తి పేలుడు పదార్ధాలను విసిరేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పేలుడు శబ్ధాలు వినగానే ముందస్తు జాగ్రత్తగా బిల్డింగ్‌ను ఖాళీ చేయించినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లు జరగడానికి ముందే ఆ ప్రాంతం నుంచి అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా వెళ్లినట్లు తెలుస్తోంది.