వాషింగ్టన్: రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా క్లస్టర్ బాంబు(Cluster bombs)లను కూడా ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా నిర్ణయించుకున్నది. ఆ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. సాధారణంగా యుద్ధాల్లో క్లస్టర్ బాంబుల వల్లే అధిక ప్రాణ నష్టం జరిగినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
ఉక్రెయిన్ అమ్ములపొదిలో ఆయుధాలు తగ్గిపోతున్నాయని, అందుకే క్లస్టర్ బాంబులు పంపాలని నిర్ణయించుకున్నట్లు బైడెన్ చెప్పారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వాగతించారు. మానవ హక్కుల సంఘాలు, కొందరు డెమోక్రాట్లు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నాటో దేశాలతో చర్చలు జరిపిన తర్వాతే ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు పంపాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ వెల్లడించారు.
దాదాపు 120 దేశాల్లో క్లస్టర్ బాంబుల వినియోగంపై నిషేధం అమలులో ఉంది. కానీ తాజా యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఆ బాంబుల్ని వాడుతున్నాయి. క్లస్టర్ బాంబుల గురించి నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ జేక్ సులివిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలని బాంబులతో మనుషులకు తీవ్ర ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. అందు వల్లే ఆ బాంబుల గురించి తాము ఇన్నాళ్లూ నిర్ణయం తీసుకోలేకపోయినట్లు చెప్పారు.
ఏంటీ క్లస్టర్ బాంబులు ?
క్లస్టర్ బాంబులంటే.. చిన్న చిన్న బాంబుల్ని ఓ భారీ బాంబు ద్వారా ప్రయోగించడం. రాకెట్ లేదా మిస్సైల్ లేదా ఆర్టిల్లరీ షెల్ ద్వారా ఆ బాంబును ప్రయోగిస్తుంటారు. అయితే క్లస్టర్ బాంబు నుంచి వెలుబడిన చిన్న చిన్న బాంబులన్నీ .. చాలా సువిశాల ప్రాంతంలో పడుతాయి. ఎప్పుడైతే అవి టార్గెట్‌ను చేరుతాయో ఆ క్షణంలో ఆ బాంబులు పేలుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని బాంబులు పేలవు. వాటిని డడ్స్ అంటారు. అంటే తొలుత అవి పేలకపోయినా.. ఆ తర్వాత అవి పేలే ఛాన్సు ఉంటుంది. బురద లేదా సాఫ్ట్‌గా ఉండే నేలపై ఆ బాంబులు పడితే..అవి సాధారణంగా పేలవు. కానీ ఏ రోజైనా ఆ బాంబుల పేలే ప్రమాదం ఉంటుంది. మిలిటరీ కోణంలో ఈ బాంబులకు ప్రత్యేక స్థానం ఉంది. సైనిక బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో లేదా కొండలు, గుట్టల్లో వీటిని జారవిడవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.