Ales Bialiatski | ప్రజల హక్కుల కోసం పోరాడిన న్యాయవాది, బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాత్‌స్కీ (Ales Bialiatski) కి స్థానిక న్యాయస్థానం పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. గతేడాది అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి అందుకున్న బియాలియాత్‌స్కీ (Ales Bialiatski).. ప్రభుత్వాదేశాలను ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని, స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఆయన స్థాపించిన హక్కుల సంస్థ `వియస్నా (Viasna)`లో పని చేస్తున్న మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. వారిలో వాలియన్సిన్ స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేండ్లు, ఉలాద్జిమిర్ లాబ్కోవిక్జ్కు ఏడేండ్లు, జిమిత్రి సలాయుకు ఎనిమిదేండ్ల జైలుశిక్ష పడింది.
1980వ దశకంలో బెలారస్లో ప్రజాస్వామ్య ఉద్యమ ప్రారంభకుల్లో బియాలియాత్‌స్కీ (Ales Bialiatski) ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధి కోసం జీవితమంతా పాటుపడ్డారు. 2020లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ నిరసనల నేపథ్యంలో బియాలియాత్‌స్కీ (Ales Bialiatski) సహా ఆయన ఇద్దరు అనుయాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 జూలై నుంచి అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. కాగా, సలాయు అప్పటికే బెలారస్ నుంచి పారిపోయారు. జైలులో ఉన్నప్పుడే, 2022 అక్టోబర్‌లో బియాలియాత్‌స్కీ (Ales Bialiatski)కి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది.
అయితే, లుకాషెంకో తన హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, వాటికి సారధ్యం వహించిన వారిపై ఉక్కుపాదం మోపుతారన్న ఆరోపణలున్నాయి. బియాలియాత్‌స్కీ (Ales Bialiatski) కి పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బెలారస్ విపక్ష నేత స్వియాత్లానా సిఖానౌస్కాయ ఖండించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటంతోపాటు వారి విడుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.