Zelensky | రష్యా సైనికుల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్ నగరంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు. ఆ పట్టణంలో ఉన్న ఉక్రెయిన్ దళాలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ దళాల ధైర్యసాహసాలను కొనియాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభమని అన్నారు. ‘రష్యాదాడుల్లో ఖేర్సన్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో క్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ.. మా బలమైన సైన్యం ఈ ప్రాంతాన్ని శత్రువుల నుంచి తిరిగి తక్కించుకుకోగలిగింది. యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం’ అని అన్నారు.
ఖేర్సన్ నగరం నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల రష్యా దళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు తొమ్మిది నెలల పాటు సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు లభించిన విజయాల్లో ఇదే కీలకం. మార్చి నెలలో ఖేర్సన్ సిటీని రష్యా దళాలు హస్తగతం చేసుకున్నాయి. లుహాన్స్క్, డొనెస్కీ, జపొరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటున్నట్లు ఇటీవల పుతిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఉక్రెయిన్ దళాలు ఖేర్సన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. గత శుక్రవారం ఆ నగరం మళ్లీ ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లింది.