Pakistan | ఇస్లామాబాద్, జవనరి 12: ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికతలో అంతర్భాగమైన చార్రితక సింధు నది ఇప్పుడు స్వర్ణ గంగగా మారింది. ఈ నది ఇప్పుడు పాకిస్థాన్‌కు బంగారు రాశులిచ్చే కల్పవల్లిగా మారింది. ఈ నదిలో ఎవరూ ఊహించనంత బంగారు నిక్షేపాలు దాగి ఉన్నట్టు పాక్ మీడియా ఇటీవల వెల్లడించింది. వాటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో రూ.60 వేల కోట్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.18,500 కోట్లు) ఉండవచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి.
పంజాబ్ ప్రావిన్సులో ప్రవహించే సింధు నదిలో బంగారంతోపాటు ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు పత్రికలు తెలిపాయి. పాకిస్థాన్‌కు ఉత్తరం వైపున ఉన్న హిమాలయాల నుంచి వేగంగా వస్తున్న నదీ ప్రవాహంలోకొట్టుకువస్తున్న బంగారు రేణువులు నది ఒడ్డుకు చేరుకుంటున్నాయని పత్రికలు తెలిపాయి. హిమాలయాల నుంచి సింధు నది రవాణా చేస్తున్న బంగారు నిల్వలు దాదాపు 32.6 మెట్రిక్ టన్నులు ఉంటాయని పాకిస్థాన్‌కు చెందిన పార్లమెంట్ టైమ్స్ దినపత్రిక వెల్లడించింది. ఈ బంగారు నిక్షేపాలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని తెలిపింది.