ఢాకా: కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్రక్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది. జస్టిస్ మహమ్మద్ గోలమ్ మోర్తుజా మొజుందార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హసీనా ఫోన్ సంభాషణ లీకైన ఘటన తీవ్ర దుమారాన్ని లేపింది. సోషల్ మీడియాలో ఆ ఫోన్ సంభాషణ లీక్ కావడంతో.. ప్రధాన మీడియా సంస్థలు కూడా ఆ కథనాన్ని ప్రచురించాయి.
గోబిందగంజ్ జిల్లా చైర్మెన్ షాకిల్ అకండ బుల్బుల్తో ఫోన్లో మాట్లాడిన హసీనా .. తనపై 227 కేసులు ఉన్నాయని, అంటే 227 మందిని చంపే లైసెన్స్ తన దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఆ వ్యాఖ్యలను వివాదాస్పదంగా తీసుకున్న ట్రిబ్యునల్.. కోర్టు ధిక్కరణ కేసుగా భావించింది. ఇదే సంభాషణలో పాల్గొన్న బుల్బుల్కు రెండు నెలల జైలుశిక్ష పడింది. నిందితులు అరెస్టు అయిన తర్వాత లేదా లొంగిపోయిన నాటి నుంచి తీర్పు అమలులోకి వస్తుంది.