ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్బిర్ రెహ్మాన్(Sheikh Mujibur Rahman) విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. షేక్ హసీనా సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో రోడ్లమీదకు వచ్చిన జనం.. ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఢాకా వీధుల్లో జెండాలతో ర్యాలీలు తీశారు. మధ్యాహ్నం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత.. షేక్ హసీనా అధికార నివాసం గేట్లను కూల్చుతూ ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఢాకాలో ఉన్న ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహం వద్ద జనం భారీ సంఖ్యలో చేరుకున్నారు. సుమారు నాలుగు లక్షల మంది ఆందోళనకారులు రోడ్ల మీద ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. మిలిటరీ విమానంలో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన షేక్ హసీనా.. తొలుత ఢిల్లీకి వచ్చి అక్కడ నుంచి లండన్ వెళ్లనున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.