Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడీ చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించారు. బంగ్లాదేశ్‌ను 15 సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ విధానం అమలులో ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల పిల్లలకు 30శాతం, దేశంలోని వెనుకబడిన జిల్లాల యువతకు 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనార్టీలకు 5 శాతం, వికలాంగులకు ఒకశాతం రిజర్వేషన్లు కల్పించారు. మొత్తంగా బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 2018లో బంగ్లాదేశ్‌లోని యువత ఈ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జూన్ 5న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశించింది. షేక్ హసీనా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును సమర్థించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా.. ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమె పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు.