Bangladesh | బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ సింగపూర్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల తలకు బుల్లెట్ గాయంతో తీవ్రంగా గాయపడ్డ హదీ ఆరు రోజుల పాటు ప్రాణాలతో పోరాడారు. ఆయన మృతితో బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హదీ మరణానికి సంతాపంగా తాత్కాలిక ప్రభుత్వం అధిపతి మహ్మద్ యూనస్ ఒకరోజు సంతాప దినంగా ప్రకటించడంతో పాటు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన మద్దతుదారులకు హామీ ఇచ్చారు. సమాచారం మేరకు ఢాకాలో గతవారం గుర్తు తెలియని వ్యక్తులు షరీఫ్ ఉస్మాన్ హదీపై కాల్పులు జరిపారు.
దాంతో వెంటనే ఆయనను ఆసుప్రతికి తరలించి.. అక్కడి నుంచి సింగపూర్‌కు తరలించారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. హదీ విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జులైలో జరిగిన ఉద్యమం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని ఉద్యమంపై జరిగిన దాడిగా భావిస్తున్నారు. హదీ మరణంపై ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ హదీ జులై ఉద్యమంలో ఒక నిర్భయ యోధుడని, ఆయన హత్య అత్యంత విచారకరమని అన్నారు. హంతకులను ఏ ధరకైనా వదిలిపెట్టబోమని హెచ్చరంచారు. హదీ భార్య, ఆయన బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. శాంతిని, సంయమనాన్ని పాటించాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు.
హదీ మరణం తర్వాత రాజధాని ఢాకాలోని షాబాగ్ స్క్వేర్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, జనం గుమిగూడి హదీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ సైతం హదీ మృతికి సంతాపం ప్రకటించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని, అవసరమైతే దేశాన్ని స్తంభింపజేస్తామని ఇంక్విలాబ్ మంచ్ హెచ్చరించింది. నిందితులు భారత్‌కు పారిపోతే.. భారత ప్రభుత్వంతో చర్చించి తిరిగి దేశానికి తీసుకురావాలని మంచ్ డిమాండ్ చేసింది. హదీ మరణం తర్వాత హింస, విధ్వంసం, భద్రతా సంక్షోభం మరింత తీవ్రమయ్యాయి. జాతీయ ఛాత్ర శక్తి అనే విద్యార్థి సంఘం ఢాకా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సంతాప యాత్ర నిర్వహించి, దాడి చేసిన వారిని పట్టుకోవడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ హోం సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి దిష్టిబొమ్మను దహనం చేసింది.
మరో వైపు ఓ గుంపు రాజధానిలోని బెంగాలీ వార్తాపత్రిక ప్రొథోమ్ అలో కార్యాలయాలపై దాడి చేసింది. ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు నిప్పుపెట్టింది. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కఠినమైన భద్రతా చర్యలు విధించింది. శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ ప్రముఖులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సరళీకృత ప్రక్రియను కూడా ప్రకటించింది. హాది మరణం బంగ్లాదేశ్‌ను మరోసారి గందరగోళంలోకి నెట్టింది. షేక్ హసీనా ప్రభుత్వానికి ఉస్మాన్ హదీ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఆగస్టు 5న అవామి లీగ్ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి కారణమైన విద్యార్థుల హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహించాడు. హది రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన హత్యలో అవామీ లీగ్ పార్టీ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.