న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) ప్రస్తుతం ఇండియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఆమె తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారినట్లు చెప్పారు. అల్లా ఓ కారణం కోసం తనను ప్రాణాలతో ఉంచారని, అవామీ లీగ్ సభ్యులను టార్గెట్ చేస్తున్న వారిని అంతం చేసే రోజు వస్తుందని ఆమె అన్నారు.
ప్రస్తుతం ఆ దేశ చీఫ్‌గా ఉన్న మొహమ్మద్ యూనుస్ టార్గెట్ చేశారు హసీనా. దేశప్రజల్ని ఆయన ప్రేమించడం లేదని ఆమె అన్నారు. చిన్న అమౌంట్‌ను అతను ఎక్కువ వడ్డీ రేట్లకు ఇచ్చారని, ఆ డబ్బుతో అతను విదేశాల్లో విలాసవంతంగా జీవించాడని, అతను ఏం చేశాడో అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని, ఆ సమయంలో అతనికి హెల్ప్ చేశామని, కానీ ప్రజలు ఎవరూ లబ్ధి పొందలేదని, అతని కోసం అతను చేసుకున్నాడని, ఇక అధికారం కోసం కాంక్షను పెంచుకుని ఇప్పుడు బంగ్లాదేశ్‌ను నాశనం చేస్తున్నాడని హసీనా ఆరోపించారు.
ఒకప్పుడు అభివృద్ధికి మోడల్ గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఉగ్రవాద దేశంగా మారినట్లు ఆమె తెలిపారు. చెప్పలేనంత హేయమైన రీతిలో తమ పార్టీ నేతల్ని హతమారుస్తున్నారని, అవామీ లీగ్ కార్యకర్తలు, పోలీసులు, లాయర్లు, జర్నలిస్టులు, ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మీడియాపై ఆంక్షలు ఉన్నట్లు ఆమె ఆరపించారు. రేప్‌లు, మర్డర్లు, దొంగతనాలు ఎటువంటి నేరాలు రిపోర్టు కావడం లేదన్నారు. ఒకవేళ రిపోర్ట్ చేస్తే, అప్పుడు ఆ టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లను టార్గెట్ చేస్తున్నట్లు హసీనా పేర్కొన్నారు.