Iskcon | ఢాకా, నవంబర్ 28: ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను నిషేధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఇస్కాన్ మాజీ సభ్యులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో ఇస్కాన్‌పై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు.. ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు నిరాకరించింది. కాగా, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో విచారణ జరపాలని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కోరారు. గురువారం ఆయనతో ఢాకాలో ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఏ ఖాన్ భేటీ అయ్యారు. హసీనాపై బంగ్లాదేశ్‌లో జరుగుతున్న విచారణతో పాటు ఐసీసీలోనూ విచారణ జరపాలని ఆయనను యూనస్ కోరారు.