Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ( బీఎన్పీ ) చైర్పర్సన్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లుగా బీఎన్పీ వెల్లడించింది. ఫజ్రు ప్రార్థనల తర్వాత ఆమె కన్నుమూశారని పేర్కొంది.
గత 36 రోజులుగా ఖలీదా జియా గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా తదితర సమస్యలతో ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ, డయాబెటిఱ్లస్, అర్థరైటిస్, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్‌తో పాటు యూకే, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. విదేశాలకు తరలించి చికిత్స అందించాలని కూడా ప్రయత్నించారు. కానీ ఖలీదా జియా ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
1945లో అప్పటి బ్రిటీష్ ఇండియాలోని జల్ఫాయిగుడిలో సికిందర్ కుటుంబంలో ఖలీదా జియా జన్మించారు. దేశ విభజన అనంతరం దినాజ్‌పూర్‌కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. 1960లో అప్పటి పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్ జియోర్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇక 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో జియోర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. 1981లో రెహమాన్ హత్య అనంతరం బీఎన్‌బీలో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఖలీదా జియా పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1984లో బీఎన్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్ రాజకీయాలపైన ఖలీదా జియా బలమైన ముద్ర వేశారు. ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టిచారు. 1991లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 1991-96, 2001-2006 మధ్య పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్‌లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైలులో గడిపారు. ఇక ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత ఇటీవలే బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చాడు. చిన్న కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేసియాలో మృతిచెందాడు.