Afghanistan | ఆఫ్ఘనిస్తాన్‌లో గర్భనిరోధకాలపై అక్కడి తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముస్లిం జనాభాను అరికట్టేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం.. ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నది. ఏ మందుల దుకాణంలోనూ గర్భనిరోధక వస్తువులుగానీ, మందులు గానీ అమ్మకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. 2021 ఆగస్టు 15 న తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడి మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్నది. ఉన్నత విద్యను అభ్యసించకుండా అడ్డుకున్నారు. మహిళలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని హుకూం జారీ చేశారు. ఇప్పుడు గర్భనిరోధక సాధనాల వాడకాన్ని కూడా నిషేధించారు.
ముస్లిం జనాభా పెరగకుండా ఉండేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, దీనిలో భాగంగానే కాంట్రాసెప్టివ్లను విరివిగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తున్నది. దీనిని నివారిందుకుగాను దేశంలో గర్భనిరోధకాల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. పాశ్చాత్య దేశాలకు ముస్లిం జనాభా పెరగడం ఇష్టం లేనందునే గర్భనిరోధకాలను మనపై బలవంతంగా రుద్దుతున్నాయని, అందువల్ల వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్ సర్కార్ చెప్తున్నది. దీనిపై గార్డియన్ పత్రిక వివరణాత్మక కథనాన్ని ప్రచురించింది. తమ సమస్యలు మగ పాలకులకు ఎలా తెలుస్తాయని, వారు స్వయంగా అనుభవిస్తే గానీ ఇలాంటి ఇబ్బందికర పనులపై వారికి అనుభవం రాదని అక్కడి మహిళలు రోధిస్తూ చెప్తున్నారని గార్డియన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.
గర్భం నిరోధించుకోవడానికి ఎలాంటి గర్భనిరోధకాలను ఉపయోగించవద్దని తాలిబాన్ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి మరీ మహిళలను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మెడికల్ స్టోర్స్‌లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తద్వారా గర్భనిరోధక మందుల అమ్మకాలను నిలిపివేయవచ్చునని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నది. కాబూల్‌లోని అన్ని మెడికల్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన నోటీసులు అతికించారు. ఎవరైనా గర్భనిరోధకాలు అమ్ముతున్నట్లు తెలిసినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారని ఓ దుకాణం యజమాని చెప్పారు. కాగా, కాందహార్‌లో నివసించే తాలిబాన్ నాయకుడు ఉస్తాద్ ఫరీదూన్ మాత్రం దీనిని విపరీత చర్యగా అభివర్ణించారు. మహిళల ప్రాణాలకు ముప్పు ఉంటే వాటిని వినియోగించవచ్చునని షరియాలో కూడా చెప్పబడిందని, అందుకని గర్భనిరోధకాలను పూర్తిగా నిషేధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.