క్వెట్టా, మార్చి 15: పాకిస్థాన్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ వేర్పాటువాదులు తమ బందీలుగా ఉన్న 214 మంది పాకిస్థానీ సైనికులను చంపివేసినట్టు ప్రకటించారు. పాక్ జైళ్లలో ఉన్న బలూచ్ రాజకీయ ఖైదీల విడుదలకు తాము ఇచ్చిన 48 గంటల గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోవడంతో తమ బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను అంతం చేశామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(ఈఎల్ఏ) శనివారం ప్రకటించింది.
రైలు హైజాక్ సుఖాంతమైనట్టు పాకిస్థానీ సైన్యం చేసిన ప్రకటనను బీఎల్ఏ ఖండించింది. తమ హెచ్చరిక పట్ల పాకిస్థానీ ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే తాము ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని బీఎల్ఏ పేర్కొంది. పాకిస్థానీ సైన్యం అపహరించిన బలూచ్ రాజకీయ ఖైదీలు, హక్కుల కార్యకర్తలను విడుదల చేస్తేనే తమ అధీనంలో ఉన్న బందీలను విడుదల చేస్తామని హెచ్చరిస్తూ బుధవారం బీఎల్ఏ పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించింది.
అయితే పాకిస్థాన్ ఎప్పటిలాగే తన మొండివైఖరిని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శిస్తూ వాస్తవ పరిస్థితులను పూర్తిగా విస్మరించిందని బీఎల్ఏ తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తమ సహచరులు 12 మంది మరణించారని బీఎల్ఏ తెలిపింది. తమకు బందీలుగా చిక్కిన పాక్ సైనికులను ప్రత్యేక బోగీలలోకి ఎక్కించి తమ సిబ్బంది కాపలా కాస్తున్నారని, మిగిలిన బందీలను వేరే సురక్షిత ప్రదేశానికి తరలించామని బీఎల్ఏ తెలిపింది. తమపై యద్ధానికి వచ్చిన పాకిస్థాన్ కమాండోలను తమ ఫిదాయీలు అంతం చేశారని పేర్కొంది.