Baby moon : సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఓ బుల్లి చంద్రుడిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ చిన్ని చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా భూమికి దగ్గరగా ఉందని తెలిపారు. నిజానికి ఆ చందమామ ఒక గ్రహశకలం. దానికి ‘2025 పీఎన్7’ అని పేరు పెట్టారు. భూమి మాదిరిగానే ఈ అంతరిక్ష శిలకు కూడా సూర్యుడిని చుట్టి రావడానికి ఒక ఏడాది సమయం పడుతోందని సైంటిస్టులు చెప్పారు.
ఇలాంటి అంతరిక్ష శిలలను క్వాసీ మూన్స్గా పిలుస్తారు. అరుదుగా భూమి చుట్టూ తిరిగే తాత్కాలిక మినీ మూన్‌లకు ఇవి భిన్నంగా ఉంటాయి. ‘2024 పీటీ5’ అనే మినీ మూన్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ‘2024 పీటీ5’ గత ఏడాది రెండు నెలలపాటు మాత్రమే భూమి చుట్టూ తిరిగింది. గతంలో చందమామ నుంచి విడిపోయిన ఒక తునకగా దాన్ని భావిస్తున్నారు. భూమికి సమీపంలో క్వాసీ చందమామలు అనేకం ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
‘2025 పీఎన్7’ను గత నెల 29న హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. ఇది భూమి సమీప కక్ష్యలో దశాబ్దాలుగా తిరుగుతోందని పాత డేటాను పరిశీలించినప్పుడు వెల్లడైంది. ఇది చిన్నగా, మసకమసకగా ఉండటంవల్ల ఇన్నేళ్లపాటు ఖగోళ శాస్త్రవేత్తల కంటపడి ఉండపోవచ్చని భావిస్తున్నారు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానికి, భూమికి మధ్య దూరం 3 లక్షల కిలోమీటర్లు ఉంటుందని, అది మరో 60 ఏళ్లపాటు పుడమికి సమీపంలో ఉంటుందని పరిశోధకులు తెలిపారు.