న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలు పెరుగడానికి వారు దుస్తులు ధరించే తీరే కారణమంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రముఖులతోపాటు, సామాన్యులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తస్లీమా నస్రీన్ మంగళవారం చేసిన ట్వీట్లో.. ‘ఓ మగాడు తక్కువ దుస్తులు ధరిస్తే.. మహిళలు రోబోలు కాని పక్షంలో ఆ మగాడు ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఇమ్రాన్ ఖాన్ అర్ధనగ్న ఫొటోను జతచేశారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ఓ వెబ్ న్యూస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ మహిళ చాలా తక్కువ దుస్తులు ధరిస్తే.. పురుషులు రోబోలు కాని పక్షంలో ఆ మహిళ ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం పురుషులపై ఉంటుందని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ గత ఏప్రిల్‌లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ.. తాను పరదా సంప్రదాయం గురించి మాట్లాడుతున్నానన్నారు. పాకిస్థాన్‌లో పూర్తిగా ప్రత్యేక తరహా సమాజం ఉందన్నారు. వారి జీవన విధానం ప్రత్యేకమైనదని తెలిపారు. సమాజంలో ఓ స్థాయికి టెంప్టేషన్‌ను పెంచితే, ఈ చిన్న పిల్లలంతా వెళ్లడానికి దారి ఏదన్నారు. దాని పర్యవసానం సమాజంలోనే ఉందన్నారు. మనం నివసించే సమాజంపైనే ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
If a man is wearing very few clothes, it will have an impact on women, unless they are robots. pic.twitter.com/2Bdix7xSv7
— taslima nasreen (@taslimanasreen) June 22, 2021