సిడ్నీ: చర్మ క్యాన్సర్ నివారణ, చికిత్సకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. సర్జరీ, రేడియోథెరపీ వంటి చికిత్సలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు ఒక క్రీమ్‌ను తయారుచేశారు. ముఖ్యంగా అవయవ మార్పిడి ద్వారా అవయవాలు పొందిన వారిలో చర్మ క్యాన్సర్ నివారణకు ఈ క్రీమ్ సమర్థంగా పని చేస్తున్నట్టు గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లోని ఫ్రేజెర్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుల బృందం ఈ క్రీమ్‌ను తయారుచేసింది. క్యాన్సర్ నివారణకు ప్రపంచంలోనే ఒక క్రీమ్ తయారుచేయడం ఇదే మొదటిసారి. ఈ క్రీమ్‌తో త్వరలోనే మనుషులపై ప్రయోగాలు జరపనున్నారు. అవయవ మార్పిడి ద్వారా అవయవాలు పొందిన వ్యక్తులకు రోగనిరోధకతను తగ్గించే ఔషధాలు ఇవ్వాల్సి వస్తుంది.
అవయవాల మార్పిడి కోసం ఈ ఔషధాలు అవసరమే అయినప్పటికీ వీటి వల్ల క్వామస్ సెల్ కార్సినోమస్(ఎస్సీసీ), కపోసీ సార్కోమా వంటి చర్మ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. ఈ క్యాన్సర్ల నివారణతో పాటు వ్యాధి ప్రారంభ దశలో చికిత్సకు సైతం తాము తయారుచేసిన క్రీమ్ ఉపయోగపడుతుందని పరిశోధకుడు జేమ్స్ వెల్స్ తెలిపారు. భవిష్యత్తులో ఇది సర్జరీ, రేడియోథెరఫీకి ప్రత్యామ్నాయంగా మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.