కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ (62) తన స్నేహితురాలు జోడి హేడన్‌ను శనివారం పెండ్లి చేసుకున్నారు. పదవిలో ఉండగా పెండ్లి చేసుకున్న తొలి ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. కాన్‌బెర్రాలోని తన అధికార నివాసంలోని ఉద్యాన వనంలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఆర్థిక సేవల ఉద్యోగిని అయిన హేడన్‌ను అల్బనీస్ మనువాడారు. ‘పెళ్లాడాను’ అనే ఒక పదంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్‌లో తన భార్య చేయి పట్టుకొని నడుచుకొని వస్తున్న వీడియోను అల్బనీస్ పోస్ట్ చేశారు. 2019లో తన గత భార్యకు అల్బనీస్ విడాకులిచ్చారు. అయిదేండ్ల క్రితం మెల్బోర్న్ బిజినెస్ డిన్నర్లో హేడన్‌ను కలిశారు. నిరుడు ప్రేమికుల దినోత్సవాన ఆయన ఆమెకు పెండ్లి ప్రతిపాదన చేశారు.