సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫాదర్స్ డే రోజున తన పిల్లల్ని కలుసుకునేందుకు ఆయన అన్ని కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకు దూరంగా ఉన్నారు. కానీ ఆదివారం రోజున ప్రధాని మారిసన్ మాత్రం ప్రత్యేక విమానంలో కెన్బెరా నుంచి సిడ్నీకి వెళ్లారు. అయితే ప్రధాని స్కాట్‌కు ఎలా మినహాయింపు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. అత్యవసర ఉద్యోగిగా భావిస్తూ.. ప్రధానికి తన ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కానీ ప్రభుత్వ వైఖరి ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శించాయి.
ఇటీవల ఆస్ట్రేలియా డెల్టా వేరియంట్ వైరస్ ప్రమాదరకర రీతిలో వ్యాపిస్తున్నది. దీంతో అక్కడ లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దేశంలోని సగం జనాభా లాక్‌డౌన్‌లోనే ఉన్నది. సిడ్నీ, కేన్బెరా, మెల్బోర్న్లో కఠినంగా లాక్డౌన్ అమలు అవుతున్నది. చాలా వరకు రాష్ట్రాలు తమ సరిహద్దుల్ని మూసివేశాయి. తన స్వంత పిల్లల్ని చూడాలనుకోవడం తప్పు కాదు అని, కానీ సాధారణ ప్రజలకు కూడా ఆ అవకాశం ఇవ్వాలని లేబర్ పార్టీ ఎంపీ బిల్ షార్టన్ ఆరోపించారు. ప్రధాని కోసం ఒక రూల్, ప్రజలకు మరో రూల్ ఉండదన్నారు.
సెప్టెంబర్ మొదటి ఆదివారం రోజున ఆస్ట్రేలియాలో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే తన కుటుంబీకులతో దిగిన ఫోటోను ఒకటి ప్రధాని మారిసన్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. తండ్రి కావడమన్నది ఓ గొప్ప ఆశీస్సు అని వివరించారు. అయితే తాను పోస్టు చేసిన ఫోటో గత ఏడాదిని మారిసన్ ఓ క్యాప్షన్‌లో తెలిపారు. లాక్డౌన్ ఆంక్షల వల్ల పేరెంట్స్ బోర్డర్ల వద్ద నిలిచిపోయారని, పిల్లల్ని కలుసుకోలేకపోయారని, కానీ ప్రధానికి ఎలా ఆ అవకాశం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చెలరేగిన ఈ వివాదంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.