న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ దానికి బానిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి వయో పరిమితిని తీసుకురావాలని యోచిస్తున్నది. అందులో భాగంగా 16 ఏండ్లలోపు వారిపై నిషేధం దిశగా అడుగులు వేస్తున్నది.
ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు. పిల్లలు తమ డివైజ్‌లకు దూరంగా మైదానాల్లో కనిపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటి వినియోగం విషయంలో పిల్లల వయసు ఎంత ఉండాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాకపోతే 14-16 ఏండ్ల మధ్య ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
తానైతే 16 ఏండ్లలోపు చిన్నారులకు ఇలాంటివి నిషేధించాలనే కోరుకుంటానని తెలిపారు. వయోపరిమితిపై మున్ముందు ట్రయల్స్ మొదలవుతాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును ఈ ఏడాదే చట్టసభల్లో ప్రవేశపెడతామని ప్రధాని చెప్పారు. ‘వయో పరిమితి’ తీసుకురావటంపై విపక్ష నాయకుడు పీటర్ డట్టన్ మద్దతు పలుకుతున్నారు. తాము అన్నింటికీ అతీతులమన్నట్టు సోషల్ మీడియా కంపెనీలు వ్యవహరిస్తున్నాయని ఓ రేడియో యాంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ వయసు ధ్రువీకరణ.. అయ్యే పనేనా? అన్న సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధం విధించినా, ప్రస్తుత టెక్నాలజీ దాన్ని అమలుజేస్తుందన్న విశ్వసనీయత లేదని ఐటీ నిపుణుడు టాబీ ముర్రే అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్యకరమైన, అర్థవంతమైన ప్రాతినిధ్యానికి యువకులను దూరం చేయటం హానికరమని క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీకి చెందిన డానియల్ అన్నారు.