కరాచీ: ఇటీవలి రైలు హైజాక్ ఘటన మరువక ముందే పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరో దాడికి పాల్పడింది. మిలిటరీ కాన్వాయ్‌పై తాము జరిపిన దాడిలో 90 మంది సైనికులు మరణించారని బీఎల్ఏ ప్రకటించింది. అయితే ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించారని, 12 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. భద్రతా దళాలు చేపట్టిన కౌంటర్ ఆపరేషన్‌లో ఒక సూసైడ్ బాంబర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు వెల్లడించింది. ఆదివారం క్వెట్టా నుంచి టఫ్టాన్‌కు ఏడు బస్సులు, రెండు ఇతర వాహనాలతో సైనికుల కాన్వాయ్ వెళ్తుండగా, ఐఈడీలతో నిండిన ఉగ్రవాదుల వాహనం ఒక బస్సును ఢీకొంది. అదే సమయంలో ఉగ్రవాదులు వారి కాన్వాయ్‌పై రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్లతో దాడి చేశారు. ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని భద్రతా దళాలు తెలిపాయి. కాగా, మిలిటరీ కాన్వాయ్‌పై తాము జరిపిన దాడిలో 90 మంది సైనికులు మరణించారని బీఎల్ఏ ప్రకటించింది. ఆర్మీ ప్రకటించినట్టు కాకుండా, తాము జరిపిన దాడిలో వారికి పూర్తి నష్టం జరిగిందని, ఒక బస్సు పూర్తిగా ధ్వంసమయ్యిందని, వెంటనే తమ బృందం పూర్తిగా ఇంకో బస్‌ను చుట్టుముట్టి వారిని హతమార్చినట్టు బీఎల్ఏ నేత మాజీద్ బ్రిగేడ్ తెలిపారు.