లాస్ ఏంజెల్స్, జనవరి 28: అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం మరోసారి కాల్పులు జరిగాయి. లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలోని ఓ రెంటల్ హోమ్‌లో జనసమూహంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. కాలిఫోర్నియాలో కాల్పులు జరగడం ఈ నెలలోనే ఇది నాలుగోసారి. ఇటీవల చైనీయులు లూనార్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా ఇదే రకంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుచోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు.