కీవ్: ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) అణు నిఘా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు కర్మాగారంలో శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం భారీగా పేలుళ్లు సంభవించినట్లు యూఎన్ అణు నిఘా సంస్థ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ ఆదివారం తెలిపారు. ఐరోపాలోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ వద్ద మళ్లీ కాల్పులు, పేలుళ్లు మొదలైనట్లు కనిపిస్తున్నదని అన్నారు. అణు విద్యుత్ ప్లాంట్ ప్రధాన ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని, ఈ వార్త చాలా ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
కాగా, యూరప్‌లోనే అతి పెద్దదైన ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్ వద్ద జరిగిన పేలుళ్లలో పెద్దగా నష్టం జరుగలేదని రాఫెల్ గ్రాస్సీ తెలిపారు. ప్లాంట్ భవనాలు, వ్యవస్థలు, పరికరాలకు క్లిష్టమైన డామేజ్ కలగలేదని చెప్పారు. అయితే రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌లో ‘శక్తివంతమైన పేలుళ్లు’ జరుగడం ఆందోళన కలిగిస్తున్నదని వెల్లడించారు.