బీజింగ్: ఆసియాలో సంపన్న మహిళగా గుర్తింపు పొందిన యాంగ్ హుయాన్ గత ఏడాది కాలంలో తన సగం సంపదను కోల్పోయింది. చైనా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఆమె సంపద తరిగిపోతున్నట్లు బిలియనీర్ ఇండెక్స్ పేర్కొన్నది. కంట్రీ గార్డెన్ ప్రాపర్టీలో ఇటీవల షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 52 శాతం ఆ కంపెనీ షేర్లు డౌన్ అయ్యాయి. గడిచిన ఏడాది 23.7 బిలియన్ల డాలర్లు ఉన్న ఆ కంపెనీ సంపద 11.3 బిలియన్ల డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సంక్షోభం నడుస్తోంది. దీంతో యాంగ్ ఒక్క ఏడాదిలోనే సుమారు 12 బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది.
యాంగ్ హుయాన్ తండ్రి.. కంట్రీ గార్డెన్ వ్యవస్థాపకుడు యాంగ్ గువాకియాంగ్. ఆయన తన కంపెనీ షేర్లను కూతురు యాంగ్కు 2005లో ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే ఆ తర్వాత రెండేళ్లకు ఆమె ఆసియాలోనే సంపన్న మహిళగా అవతరించారు. 2020లో చైనా ప్రభుత్వం రియల్ ప్రాపర్టీ రంగంపై కొరడా రుళుపించింది. అప్పటి నుంచి రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టినవారి సంపద తగ్గుతూ వస్తోంది.