లండన్: ప్రపంచవ్యాప్తంగా అరటిపండ్ల ధరలు(Banana Prices) పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఆ పండు దిగుబడిపై పడినట్లు తెలుస్తోంది. ఆ పరిశ్రమకు చెందిన మేటి నిపుణులు అరటిపండు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వరల్డ్ బనానా ఫోరమ్‌కు చెందిన సీనియర్ ఎకానమిస్ట్ పాస్కల్ లియూ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల అరటిపండ్ల సరఫరాపై ప్రభావం పడినట్లు తెలిపారు. దీనికి తోడు ఆ పండ్లకు సోకే వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పారు.
రోమ్‌లో జరగనున్న భేటీలో వరల్డ్ బనానా ఫోరమ్ కలుసుకోనున్నది. యూకేలో ఉన్న కొన్ని షాపుల్లో ఇటీవల అరటిపండ్లు జాడ లేకుండాపోయింది. అక్కడ ఆ పండ్ల కొరత తీవ్రంగా ఉన్నది. సముద్ర తుఫాన్ల వల్ల ఉత్పత్తి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క బ్రిటన్ ప్రతి ఏడాది 5 బిలియన్ల బనానాలను దిగుమతి చేసుకుంటుంది. వాటిల్లో 90 శాతం అమ్మకాలు సూపర్మార్కెట్ల ద్వారా జరగనున్నాయి.
గడిచిన వారం బ్రిటన్‌లోని సూపర్మార్కెట్లు అన్నీ అరటిపండు కొరతను ఎదుర్కొన్నాయి. తుఫాన్ల వల్ల సరఫరాలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. సప్లయ్ చెయిన్‌లో ఒడిదిడుకుల వల్లే కూడా అరటిపండ్ల ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అరటిపండ్ల పరిశ్రమకు వాతావరణ మార్పు దెబ్బ తగిలినట్లు వరల్డ్ బనానా ఫోరమ్ ఎకానమిస్ట్ లియూ తెలిపారు.
తుఫాన్ల వల్ల సరఫరాలు నిలిచిపోవడం.. వేడెక్కుతున్న వాతావరణం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు భావిస్తున్నారు. వీటికి తోడు వేడి వాతావరణంలో వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల అరటిపండ్ల ఉత్పత్తి తగ్గుతోంది. టెంపరేచర్ల ఒడిదిడుకుల పట్ల ఆ పండ్లు చాలా సున్నితంగా ఉంటాయని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ వేడి వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
వేడి వాతావరణం వల్ల వ్యాధులు వేగంగా విస్తరించడమే అతిపెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఫుసేరియం విల్ట్ టీఆర్4 అనే ఫంగల్ వ్యాధి అరటి తోటల్లో ఎక్కువగా సోకుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ఆ వ్యాధి ఏషియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దిశగా పయనిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒకసారి ఆ ఫంగస్ అరటి తోటల్లోకి ప్రవేశిస్తే, అప్పుడు ఆ అరటి చెట్లను ఆ ఫంగస్ పూర్తిగా తినేస్తుంది. ఆ ఫంగస్‌ను తొలగించడం చాలా కష్టమైన అంశమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
రోమ్‌లో జరగనున్న సదస్సులో అరటి పండ్ల గురించి సమగ్ర స్థాయిలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.