న్యూఢిల్లీ, డిసెంబర్ 23: మీరు తరచూ కృత్రిమ తీపి పదార్థాలు వాడుతున్నారా? అవి అధికంగా వాడితే మీ లివర్, ఇతర అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు పరిశోధకులు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తదితరులకు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ కృత్రిమ తీపి పదార్థాలు వాడమంటూ సంబంధిత సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యపరంగా ఎంతమాత్రం మంచిది కాదని ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. పరిశోధన వివరాలు సైన్స్ సిగ్నలింగ్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో గ్యారీ పట్టి ఆధ్వర్యంలో పరిశోధన శాలలో ప్రయోగాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్యారీ పట్టి మాట్లాడుతూ కాలేయం ద్వారా ప్రాసెస్ అయిన ఫ్రక్టోజ్ క్యాన్సర్ కణాలు పెరుగుదలకు దారి తీస్తుందని తన మునిపటి అధ్యయనాలు నిరూపించాయన్నారు. దీని కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ రోగం సంభవిస్తుందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది పెద్దలను ప్రభావితం చేసిందన్నారు. ఇలా పేరుకుపోయిన కొవ్వు కాలేయం బరువులో 5 శాతానికి చేరుకున్నప్పుడు అది సమస్యగా మారుతుందన్నారు.
రోజువారీ జీవితంలో యాపిల్, బేరి వంటి పండ్లలో సహజంగా ఉండే తక్కువ స్థాయిలో సోర్బిటాల్ (ఒక రకమైన చక్కెర ఆల్కహాల్)ను తీసుకునేటప్పుడు పేగుల్లోని మైక్రోబయోమ్ సాధారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా క్లియర్ చేస్తుందన్నారు. సోర్బిటాల్ ఉత్పత్తి తీసుకున్నప్పుడు సూక్ష్మజీవుల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అధిగమిస్తే సవాళ్లు ఎదురవుతాయని ఆయన చెప్పారు. మంచి బ్యాక్టీరియా ఉన్న వ్యక్తులు కూడా గ్లూకోజ్, సోర్బిటాల్ వినియోగం ఎక్కువగా ఉంటే సమస్యలు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు.