దావోస్ : ‘మానవుడు వేగంగా పని చేయడానికి సహాయపడే సాధనంగా కృత్రిమ మేధ (ఏఐ) ఇక ఎంతమాత్రం ఉండబోదు. క్రమంగా దానంతట అదే పని చేసే స్థితికి వస్తున్నది. దీని పూర్తి ప్రభావాన్ని ఎదుర్కొనబోయే మొదటి కెరీర్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్’ అని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమొడెయి అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఏఐ ఏం చేయగలదు? అనే అంశంపై ప్రపంచం తీరిక లేకుండా చర్చిస్తున్నదన్నారు. ఏఐ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని మూరేస్ లాతో పోల్చారు. ప్రతి కొన్ని నెలలకు దాదాపు యాంత్రికంగా, నిలకడగా ఏఐ మోడల్స్ మరింత సమర్థతను సొంతం చేసుకుంటున్నాయన్నారు. ఈ ప్రగతి ఎంత వేగంగా వాస్తవ ప్రపంచ మార్పులుగా మారుతాయనే దానిపై నిజమైన విధ్వంసం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆంత్రోపిక్‌లో కొందరు ఇంజినీరింగ్ లీడ్స్ ఇకపై కోడ్‌ను తమంతట తాము రాయరని, తమ కంపెనీ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ మోడల్ క్లౌడ్‌పై ఆధారపడతారని చెప్పారు. ఏఐ సిస్టమ్స్ అత్యంత సంక్లిష్టమైన పనులను చేపడతాయని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో మనుషులతో కూడిన బృందాల అవసరం ఉండదని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏఐ అసాధారణ దశకు తీసుకెళ్తుందని డారియో తెలిపారు. ఓ వైపు అత్యధిక వృద్ధి ఉంటుందని, మరోవైపు నిరుద్యోగ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫలితంగా అసమానతలు పెరుగుతాయన్నారు. జీడీపీ వృద్ధి పటిష్టంగా ఉంటే, ఎక్కువ ఉద్యోగాల సృష్టి జరుగుతుందనేది చరిత్ర అని, ఆ లింక్‌ను ఏఐ తెగ్గొడుతుందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ప్రతి సంవత్సరం 5 శాతం లేదా 10 శాతం పెరుగుతాయని, నిరుద్యోగం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. కొందరు వర్కర్లు తాము పని చేస్తున్న రంగాల్లోనే తమ రోల్స్‌ను మార్చుకోవచ్చునని, ఏఐతో కలిసి పని చేయడం నేర్చుకుంటారని చెప్పారు. శారీరకంగా హాజరుకావడం లేదా మానవులతో మాట్లాడటం అవసరమైన ఉద్యోగాలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందన్నారు.