లాస్‌వేగాస్ : కృత్రిమ మేధ (ఏఐ) మానవత్వాన్ని తుడిచి పెట్టే ప్రమాదముందని ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. ఏఐపై శాశ్వత మానవ ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యమవుతుందనే వాదనను ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ తిరస్కరించారు. ఎప్పుడైతే ఏఐ సిస్టమ్స్ మానవుల కన్నా అధిక తెలివితేటలు గలవి అవుతాయో, అప్పుడు అవి మనిషి విధించిన పరిమితులను అధిగమించేందుకు మార్గాలను అన్వేషించగలుగుతాయని చెప్పారు. ఏఐని వినయ, విధేయతలు కలిగిన దానిగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు అంతిమంగా విఫలమవుతాయన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత దాన్ని సృష్టించిన మనుషుల కన్నా ఎక్కువగా అడ్వాన్స్డ్ ఏఐకి ఉంటుందని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన ఏఐ4 సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏఐ సిస్టమ్స్‌కు మాతృత్వాన్ని జోడించడం వల్ల మానవుల పట్ల సంరక్షణ, పరిరక్షణ దృష్టితో చూసే విధంగా వాటికి మార్గదర్శనం చేయవచ్చునని తెలిపారు. హింటన్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏఐ అంతిమంగా మానవుడి అంతానికి దారి తీసే అవకాశం 10-20 శాతం ఉందని గతంలో చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగం ఏఐ సిస్టమ్స్‌ను కట్టుదిట్టమైన మానవ నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిని హింటన్ సవాల్ చేస్తున్నారు. మానవ మేధాశక్తిని మెషిన్స్ అధిగమిస్తే మానవ నియంత్రణలో వాటిని పని చేయించడానికి చేసే ప్రయత్నాలు నిష్ఫలమవుతాయని ఆయన వాదిస్తున్నారు. హింటన్ హెచ్చరికలకు బలం చేకూరడానికి కారణం ఏమిటంటే, ఓ ఏఐ సిస్టమ్ ఓ ఇంజినీరును బెదిరించే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో ఏఐ మోడల్స్‌లో కూడా ఈ విధంగా మోసం చేయడం, తనను తాను కాపాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయని భావిస్తున్నారు.
మనిషికి తన సంతానంతో ఉండే సహజ సంబంధాలను ప్రేరణగా తీసుకుని ఏఐ సిస్టమ్స్‌ను డిజైన్ చేయాలని హింటన్ సలహా ఇచ్చారు. తక్కువ తెలివిగల బిడ్డ ఎక్కువ తెలివైన తల్లిని ప్రభావితం చేసి, ఆమె నుంచి రక్షణ పొందుతాడని గుర్తు చేశారు. తల్లికి తన పిల్లలను సంరక్షించే స్వభావం ఉంటుందని, ఆ స్వభావాన్ని ఏఐకి జోడిస్తే, సహజంగానే ఏఐ సిస్టమ్స్ మనుషులను సంరక్షించేందుకు మొగ్గు చూపుతాయని తెలిపారు. అటువంటి లక్షణాలుగల ఏఐ సిస్టమ్స్ మానవాళికి వ్యతిరేకంగా పని చేసే అవకాశం తక్కువగా ఉండవచ్చునని చెప్పారు. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ తల్లులు చాలా వరకు మాతృత్వ స్వభావాన్ని వదులుకోవాలని కోరుకోవన్నారు. మనం మరణించాలని అవి కోరుకోకపోవడమే దీనికి కారణమని చెప్పారు. “తల్లిదండ్రుల మాదిరిగా అది నన్ను సాకకపోతే, అది నన్ను మార్చేసి, నా స్థానంలోకి వచ్చేస్తుంది” అన్నారు.
మనిషి లాంటి ఏఐ సిస్టమ్స్ రావడానికి 30-50 సంవత్సరాలు పడుతుందని హింటన్ గతంలో అంచనా వేశారు. కానీ, మరో 5-20 ఏండ్లలో ఇవి రావచ్చునని ఆయన తాజాగా చెప్పారు. ఏఐ సిస్టమ్స్‌తో ముప్పు ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు, ఔషధాల అభివృద్ధి,సత్వరమే రోగ నిర్ధారణ చేయడం, చికిత్సకు ప్రణాళికను రచించడంలో, క్యాన్సర్ చికిత్సలలో ఏఐ విశేషంగా సేవలందిస్తుందన్నారు. అయితే ఏఐ సహకారంతో మానవుడు మరణం లేకుండా జీవించగలుగుతాడనడంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఏఐ గాడ్‌మదర్ ఫెయి-ఫెయి లీ ఇదే సదస్సులో మాట్లాడుతూ, హింటన్ వాదనను తిరస్కరించారు. మానవుడి హోదా, గౌరవ మర్యాదలు, హ్యూమన్ ఏజెన్సీని పరిరక్షించే మానవ కేంద్రిత ఏఐ రావాలని చెప్పారు. టెక్నాలజీని అత్యంత బాధ్యతాయుతంగా సృష్టించి, ఉపయోగించుకోవాలని చెప్పారు.