న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దాదాపు అర్ధ శతాబ్దం తరువాత జాబిల్లిని చుట్టి వచ్చిన వ్యోమగాములు శనివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆర్టెమిస్-2 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు పది రోజుల క్రితం జాబిల్లి యాత్రకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఓరియన్ క్యాప్సూల్ (రాకెట్)లో సుమారు 11 లక్షల కిలోమీటర్ల దూరం (భూమి, చంద్రుడి కక్ష్యల్లో తిరగడం కలుపుకొని) ప్రయాణించిన వ్యోమగాములు అమెరికా కాలమానం ప్రకారం శాన్డీగోకు సమీపంలో ఉదయం 5.37 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలో దిగారు.
ఈ వ్యోమగాములు భూమి నుంచి సుమారు 4,06,778 కిలోమీటర్ల దూరం జాబిల్లి చెంతకు వెళ్లి వచ్చారు. 1972 తరువాత మానవులు చంద్రుడి సమీపానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ యాత్ర ఉద్దేశం అంతరిక్ష నౌకలో జీవనాధార వ్యవస్థను పరీక్షించడమే.