ఇస్లామాబాద్: పాకిస్థాన్ తదుపరి అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) బాధ్యతలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న ఆసిఫ్ అలీ జర్దారీని తొలగిస్తారని, ఆయన స్థానంలో మునీర్ నియమితులవుతారని గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా మునీస్ స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. పాక్ నాయకత్వలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదన్నారు. అధ్యక్షుడు జర్దారి తొలగింపు గురించి వస్తున్నవన్నీ గాలి వార్తలేనని స్పష్టం చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే అవస్థవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధ్యక్ష పదవి నుంచి జర్దారీని తొలగిస్తారని, ఆర్మీ చీఫ్ దేశ అత్యున్నత పదవిని చేపడతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ ఖండించారు. తాజాగా ఆసిమ్ కూడా తోసిపుచ్చారు. అమెరికా పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో బెల్జియంలో ఆగిన మునీర్‌తో జంగ్ మీడియా గ్రూప్ కాలమిస్ట్ సుహైల్ వర్రైచ్ మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్ష మార్పు గురించి ప్రస్తావించడంతో అలాంటిదేమీ జరగదని స్పష్టం చేశారు. ఈ పుకార్ల వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే, రాజకీయంగా దేశంలో అరాచకం సృష్టించాలనుకునే అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.