న్యూయార్క్: సాధారణంగా దొంగలు తాము దోచుకోవాలనుకున్నది దోచుకోగానే జాడలేకుండా పారిపోతారు. పైగా ముఖం కనిపించకుండా ముసుగులు వేసుకుంటారు. కానీ న్యూయార్క్‌లో ఓ దొంగ మాత్రం దర్జాగా, ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు.
దాంతో బాధితుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. ‘సారీ బ్రదర్, ఈ నెల నేను చాలా బిల్లులు కట్టేది ఉంది. అందుకే నీ దగ్గర దొంగతనం చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అనంతరం బాధితుడిని అతను దిగాల్సిన ప్రాంతంలో దించాడు.
ఆ తర్వాత బాధితుడితో ఇన్‌స్టా హ్యాండిల్‌ను షేర్ చేసుకున్నాడు. ఇద్దరం ఇకపై టచ్‌లో ఉందామని చెప్పాడు. అయితే, వెళ్తూవెళ్తూ బాధితుడి సెల్‌ఫోన్‌ను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. కొన్ని బిల్లులు కట్టిన తర్వాత రేపు ఫోన్ తిరిగి ఇస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.