Seema Haider : ప్రియుడు సచిన్ మీనా కోసం నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌పై ఆమె భర్త గులామ్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీమా హైదర్ భారత్‌కు వచ్చినప్పటి నుంచి తన భార్యను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని ఆమె పాకిస్తాన్ భర్త గులామ్ హైదర్ సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆమెను తనను మోసం చేసి, తన ఆస్తులను అమ్ముకుని పారిపోయిందని ఆరోపిస్తున్నాడు.
భార్య దేశం విడిచి పోయినప్పటి నుంచి గులాం హైదర్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు. ఆమెను, తన పిల్లలను పాకిస్థాన్‌కు పంపించాలని భారత ప్రభుత్వాన్ని రకరకాలుగా అభ్యర్థిస్తున్నాడు. ఈ మేరకు పలు వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్‌కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో తన భార్యను, పిల్లలను వెనక్కి పంపించాలని అతను మరోమారు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. అదేవిధంగా సీమా హైదర్ తరపు న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రపాల్‌లను హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలో తాను పాకిస్థాన్ నుంచి భారత్‌కు వెళ్తానని కూడా గులామ్ హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు.
అదేవిధంగా తన భార్య సీమా హైదర్‌పై గులామ్ హైదర్ పలు ఆరోపణలు చేశాడు. ఆమె తన పిల్లలను పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లలను తనతోపాటు తీసుకొచ్చుకునేందుకు కచ్చితంగా భారత్‌కు వెళ్తానని, భారతదేశ ప్రజలపైన, అక్కడి చట్టాలపైన తనకు పూర్తి నమ్మకం ఉందని గులామ్ హైదర్ అన్నాడు. తన పోరాటానికి భారత్‌లో తప్పకుండా మద్దతు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అంతేగాక ‘సీమా హైదర్ ఒక దొంగ. నేరస్తురాలు. నా ఆస్తి, ఇల్లు అమ్మేసి భారత్‌కు పారిపోయింది. అందుకే నేను రోడ్డున పడ్డాను. సీమా ఇక నువ్వు ఏం చేసినా తప్పే. నువ్వు ఏడుస్తావు. పశ్చాత్తాప పడతావు. బాధపడతావు. ఆర్తనాదాలు చేస్తావు. ఏదో ఒకరోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తా. అదే నా జీవిత లక్ష్యం’ అని ఆ వీడియోలో గులామ్ హైదర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
ప్రధాని మోదీపైన, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పైన, పాకిస్థాన్ ప్రభుత్వంపైన తనకు పూర్తి విశ్వాసం ఉందని గులామ్ హైదర్ ఆ వైరల్ వీడియోలో పేర్కొన్నాడు. సీమా హైదర్ ప్రియుడు సచిన్ మీనాకు, న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రపాల్లకు హెచ్చరికలు చేశాడు. మీరు తప్పు చేస్తున్నారు. ఏదో ఒకరోజు మీ అందరికీ శిక్ష పడుతుంది’ అని గులామ్ తన వీడియోలో హెచ్చరించాడు.