డబ్లిన్, జూలై 31 : ఐర్లాండ్లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా డబ్లిన్లో కొంతమంది టీనేజర్లతో కూడిన ఓ గ్యాంగ్ ఓ భారత సంతతి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఐరిష్ నగరం లెట్టర్కెన్నీలో సీనియర్ డాటా సైంటిస్టుగా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి సంతోశ్ యాదవ్ మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. మెడ, ఛాతి, చేతులు, కాళ్లు, తలపై ఆపకుండా దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు.
తనపై జరిగిన దాడి ఘటనను తెలియజేస్తూ, ‘ఐర్లాండ్లో జాతివివక్షతో కూడిన దాడులు సర్వసాధారణంగా మారాయి. ఆరుగురు టీనేజర్లు నా వెనుక నుంచి నాపై దాడి చేశారు. దవడ ఎముక విరిగిపోయింది. డబ్లిన్ సహా ఐర్లాండ్ అంతటా భారతీయులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీలు పట్టించుకోవటం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి దిగినవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్లోని భారత ఎంబసీ, భారత విదేశాంగ శాఖలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేశాడు.