Narendra Modi : ఇటీవలి కాలంలో ఇండియా, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతంలోనే అంతంతమాత్రంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ల తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరకు పాకిస్తాన్‌కు నీళ్లు కూడా ఇవ్వకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. ఏడాదిపైగా ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ.. ఇండియా, పాకిస్తాన్లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాశారు.
ఇందులో ఇండియా నుంచి 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ప్రముఖులు ఉన్నారు. ఇరు దేశాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న తమ శతృత్వాన్ని పక్కనబెట్టాలని లేఖలో కోరారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన వల్ల రెండు దేశాలకు చెందిన లక్షలాది మంది యువత ఇబ్బంది పడుతున్నారని, అనేక అవకాశాలు కోల్పోతున్నారని, ఆర్థికపరంగా నష్టం కలుగుతోందని లేఖలో వివరించారు. విశ్వాసం పెంపొందించేందుకు ఇరు దేశాల నేతలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సేవలు తిరిగి పునరుద్ధరించాలని, సాధారణ వీసా సేవలు, విమానయాన సేవలు ప్రారంభించాలని కోరారు. రెండు దేశాల సరిహద్దు అయిన అట్టారి-వాఘా మార్గాన్ని తెరవాలని, వ్యాపారం, వాణిజ్యం, పర్యటనలకు అవకాశం కల్పించాలని లేఖలో ప్రస్తావించారు.
ఈ లేఖ రాసిన వారిలో ఇండియా నుంచి నేషనల్ కాంగ్రెస్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, టీఎంసీ మాజీ మంత్రి హుమాయున్ కబిర్ వంటి ప్రముఖులు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మాజీ విదేశాంగ మంత్రి ఖర్షిద్ మహముద్ కసూరి, మాజీ దౌత్యవేత్త అష్రాఫ్ జెహంగిర్ ఖ్వాజి, అణుశాస్త్రవేత్త పర్వేజ్ వంటి వారు ఉన్నారు. అయితే, పాకిస్తాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన, వాణిజ్యపరమైన సంబంధాలు లేవని గతంలోనే ఇండియా తేల్చి చెప్పింది. దీనిలో భాగంగా సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా ఇండియా రద్దు చేసింది.