వాషింగ్టన్: అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్(USS Abraham Lincoln).. పశ్చిమాసియా సముద్ర జలాల నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో గడిచిన 9 నెలల నుంచి ఆ యుద్ధనౌక హోర్ముజ్ సమీపంలో ఉన్నది. అయితే ఇరాన్‌పై యుద్ధం చేసిన ఆ యుద్ధనౌక సైనికులు ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా క్షీణించినట్లు తెలిసింది. ఆహార నిల్వలు కూడా తగ్గడంతో యుద్ధనౌక వెనుతిరుగుతున్నట్లు భావిస్తున్నారు. శాన్ డియాగోకు లింకన్ నౌక పయనమైనట్లు తెలుస్తోంది.
దీని స్థానంలో యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ యుద్ధనౌక అక్కడకు చేరుకున్నది. ఆ నౌక ఆపరేషనల్ డ్యూటీస్ నిర్వర్తించనున్నది. లింకన్ నౌకలో సుమారు 5వేల మంది సిబ్బంది పనిచేస్తారు. వాళ్లంతా ఇప్పుడు సేద తీరనున్నారు. 2025 నవంబర్ 21వ తేదీన అబ్రహం లింకన్ నౌక శాన్ డియాగో నుంచి బయలుదేరి పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్నది. ఇరాన్‌తో జరిగిన వార్‌లో ఆ సిబ్బంది పాల్గొన్నది.
అమెరికా మిలిటరీ ఆపరేషన్స్‌కు లింకన్ నౌక కీలకంగా వ్యవహరించింది. వేలాది సంఖ్యలో ఆ నౌక సిబ్బంది సోర్టీలు నిర్వహించింది. దీని వల్ల సిబ్బంది చాలా వరకు అలసిపోయారు. సుదీర్ఘకాలం యుద్ధ నౌకలో ఉండడం వల్ల సిబ్బంది నిర్వీర్యం అవుతున్నట్లు తెలిసింది. కొందరు సైనికులు మానసిక క్షోభను తట్టుకోలేకపోతున్నట్లు గుర్తించారు. సుమారు 200 రోజుల పాటు ఆ యుద్ధనౌక ఎటువంటి పోర్టుతో లింకు లేకుండానే తన విధులు కొనసాగించింది.