Joe Biden on Afghan | ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదాన్ని సహించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టిగా హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ల తరలింపు ప్రారంభమైందని చెప్పారు.
ఇప్పటివరకు 13 వేల మందిని తరలించామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లను తరలించడం అంత తేలిక కాదని స్పష్టం చేశారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.అమెరికన్లను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని పేర్కొన్నారు. అమెరికన్ల భద్రతే తమకు ప్రధానమని వెల్లడించారు.
అమెరికన్లను తరలించే విషయమై తాలిబన్లతో చర్చిస్తున్నట్లు జో బైడెన్ తెలిపారు. అమెరికన్లను తరలించడానికి ఆఫ్ఘన్‌కు మరిన్ని విమానాలను పంపుతామని చెప్పారు. అమెరికన్ పౌరులపై హింసను సహించబోమని తాలిబన్లను హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో వారం రోజులుగా కనిపిస్తున్న ద్రుశ్యాలు హ్రుదయ విదారకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై వచ్చేవారం జీ-7 దేశాల కూటమి చర్చిస్తుందని జో బైడెన్ వివరించారు.
ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ వంటి వారినే ఏరివేశామని జో బైడెన్ చెప్పారు. కాబూల్ విమానాశ్రయం ఆరువేల మంది అమెరికా సైనికుల పహారాలో ఉన్నదని తెలిపారు. మీడియా సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ఉన్నారు.