Obesity | న్యూయార్క్: ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే కొత్త గ్యాస్ట్రిక్ బెలూన్ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ బుడగను కడుపులోకి పంపించి, ఆహారం తక్కువ తినేలా చేయవచ్చు. తద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఈ గ్యాస్ట్రిక్ బెలూన్‌కు సంబంధించిన వివరాలు ‘డివైజ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు ఉన్న గ్యాస్ట్రిక్ బెలూన్లను ఊబకాయుల కడుపులోకి పంపించి స్లైన్ నింపుతారు. దీంతో వారి కడుపు నిండుగా అనిపించి ఆహారం తక్కువ తీసుకుంటారు. అయితే, ఒకసారి ఈ బుడగ ఉన్నట్టు శరీరం అలవాటు చేసుకుంటే దీని సమర్థత తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ఎంఐటీకి చెందిన ఇంజినీర్లు కొత్త డిజైన్‌తో గ్యాస్ట్రిక్ బెలూన్ను అభివృద్ధి చేశారు.
సిలికాన్‌తో చేసిన ఈ బెలూన్ను కడుపులోకి పంపించిన తర్వాత ఆహారం తీసుకునే ముందు గాలి ఊదాలి. దీంతో తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. తిన్న తర్వాత బెలూన్ నుంచి గాలి తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిగతా గ్యాస్ట్రిక్ బెలూన్ల కంటే ఎక్కువగా కాలం ఈ బెలూన్ సమర్థంగా పని చేస్తుందని ఎంఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ జియోవన్ని ట్రావెర్సో తెలిపారు.
నోటితో ఆహారం తీసుకోలేని వారికి ఫీడింగ్ ట్యూబ్‌ను కడుపులోకి పంపించినట్టుగానే ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ను కూడా పంపిస్తారు. దీనికి అనుసంధానంగా బయట చర్మానికి ఒక చిన్న పంప్‌ను ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా కడుపు లోపలి బెలూన్‌లోకి అవసరమైనప్పుడు గాలి పంపించొచ్చు లేదా తీసేయొచ్చు. ఈ బుడగను జంతువులపై ప్రయోగాలు జరపగా, అవి తినే ఆహారం 60 శాతం మేర తగ్గిపోయిందని తేలింది. ప్రస్తుత ఊబకాయ చికిత్సలు ఫలించని వారికి ప్రత్యామ్నాయంగా ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ను వినియోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.